బొబ్బిలి మున్సిపాలిటీకి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మంజూరైంది. మురుగు కాలువల్లో వచ్చే నీటిని యంత్రాలద్వారా శుద్ధి చేసి సమీపాల్లోని చెరువుల్లో విడిచిపెట్టాలన్నది ఆ ప్రాజెక్టు లక్ష్యం. అందులో భాగంగా మూడు ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక ప్లాంట్‌కు రూ.10 కోట్లకు టెండర్ కూడా ఖరారైపోయింది. పట్టణంలో సుమారు 98 కిలోమీటర్ల పొడవున ఉన్న పెద్దకాలువలు, వీధికాలువలు, ఇతరత్రా ప్రవహించే వ్యర్థ జలాలను శుద్ధిచేసేందుకు సీవేజ్‌వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సంబంధిత అధికారులు వచ్చి పట్టణంలో మురుగు కాలువల స్థితిగతులపై సమగ్రంగా సర్వే చేశారు. మేదరబందలో 4.7 ఎకరాల స్థలాన్ని ప్రాథమికంగా గుర్తించారు. అయితే మూడుచోట్ల ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో ప్లాంటుకు 1నుంచి 1.50 ఎకరాల భూమి సరిపోతుంది. ప్రభుత్వ భూమి అందు బాటులో లేకపోతే కొనుగోలు చేసేందుకు రూ.9.30 కోట్లు చొప్పున నిధులు కూడా విడుదలయ్యాయి.