దేశ వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు, పేదలు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం వ్యవసాయ కార్మికసంఘం పోరాటాలు సాగిస్తుందని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.సత్యనారాయణ పేర్కొన్నారు. అమలాపురం ఎంప్లాయీస్ హోంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లాశాఖ సమావేశం కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సంఘం విశిష్టత, ఉపాధిహామీ ఆవశ్యకత అనే అంశంపై సత్యనారాయణ ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. ఉపాధిహామీ పథకంలో వ్యవసాయ కార్మిక కుటుంబాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఇటీవల కూలీలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసే దురాలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ప్రయత్నాలను అవసరమైతే పోరాటాల ద్వారా అడ్డుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు తాడి శ్రీరామమూర్తి, పొలమూరి శ్రీనివాసరావు, ఇసుకపట్ల మంగాదేవి, బీర వెంకట్రావు, పెట్టా ఆనందరావు, రాయుడు వీరన్న, రాజేశ్వరి, అనంతలక్ష్మి, లక్ష్మి పాల్గొన్నారు.