(స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కడప జిల్లాలోని కొప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అదేవిధంగా రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధిపథంలో దూసుకుపోనుంది. ఇక, తెలంగాణలోని జహీరాబాద్‌లోనూ పారిశ్రామిక స్మార్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లో ఇదే తరహాలో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. ఆయా వివరాలను.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, అశ్వినీ వైష్ణవ్‌లు మీడియాకు వివరించారు. దేశంలో రూ.28,602 కోట్ల పెట్టుబడితో 12 కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నెలకొల్పనున్నట్టు చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ పూర్తయిందని, పర్యావరణ అనుమతులు కూడా తీసుకున్నామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టులను శరవేగంతో పూర్తి చేస్తామన్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ఆయన హయాంలో ఈ స్మార్ట్ సిటీలు వేగంగా అభివృద్ధి చెందుతాయని మంత్రులు తెలిపారు. విభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఈ స్మార్ట్ సిటీలు వరంగా మారుతాయన్నారు. ముఖ్యంగా సీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు.