ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో కారు కొట్టుకుపోయి టీచర్, విద్యార్థులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 07:28 PM

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలు చోట్ల తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విషాదం చోటు చేసుకుంది. వరద ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయి, స్కూల్ టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మానిక్‌గా గుర్తించారు. మంగళగిరి మండలం, ఉప్పలపాడుకు చెందిన నడుంపల్లి రాఘవేంద్ర (38).. నంబూరులోని వివా స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తరగతులు ముగిసిన అనంతరం.. ఇంటికి బయల్దేరే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో.. అదే పాఠశాలలో చదువుతున్న ఉప్పలపాడుకు చెందిన పసుపులేటి సౌదీస్ (6 ఏళ్లు), కోడూరి మాన్విత్ (9 ఏళ్లు) విద్యార్థులను తన కారులో ఎక్కించుకొని బయల్దేరారు. ఉప్పలవాడు సమీపంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో.. వారు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయి కాలువలోకి వెళ్లిపోయింది.


స్థానికులు గమనించి తాళ్ల సాయంతో కారును కాలువలో నుంచి బయటకి తీసుకొచ్చారు. కారులో నుంచి టీచర్, ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో టీచర్ రాఘవేంద్ర, విద్యార్థుల ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఒక బాలిక, ఇద్దరు మహిళలు ఉన్నారు.


సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండచరియలు విరిగిపడుతుండటంతో విజయవాడ దుర్గ గుడి ఘాట్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గగుడి పైవంతెనను కూడా తాత్కాలికంగా మూసివేశారు.


ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటి విడుదల


విజయవాడ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి భారీగా పెరిగింది. దీంతో బ్యారేజ్ మొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. అధికారులు 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


మూడు రోజుల పాటు రైళ్లు రద్దు


భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా కారణాల రీత్యా వీటిని రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. శని, ఆది, సోమవారాల్లో 20 వరకు రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ - తెనాలి, విజయవాడ - గూడురు, తెనాలి - రేపల్లె, గుడివాడ - మచిలీపట్నం, భీమవరం - నిడదవోలు, గుంటూరు - రేపల్లె, విజయవాడ - మచిలీపట్నం, విజయవాడ - ఒంగోలు తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశారు. తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com