ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు ఉగ్రరూపాన్ని దాల్చాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. చాలా చోట్ల రాకపోకలు బందయ్యాయి. ఇప్పటికే జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. అయితే.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలుండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో.. ముందస్తు జాగ్రత్తగా రెండు రాష్ట్రాల ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించాయి. అయితే.. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో జలదిగ్బంధనం కాగా.. భారీ వర్ష సూచనతో జనం తీవ్ర భయాందోళనలో ఉన్నాయి. అయితే.. అదే వాతావరణ శాఖ తాజాగా ఇచ్చిన సమాచారంతో తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం కలిగినట్టయింది. అల్పపీడనం వేగంగా ముందుకు కదులుతుండటంతో.. రేపటి వరకు భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలంగాణలో వర్షాల పరిస్థితేంటంటే..?
అయితే.. తెలంగాణకు మాత్రం మరో 24 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని అధికారులైతే చెప్తున్నారు. రాష్ట్రంలోని.. 8 జిల్లాలకు మాత్రం అత్యంత భారీ వర్ష సూచన ఉండటంతో వాటికి ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.
14 జిలాల్లో భారీ వర్ష సూచన ఉండటంతో వాటికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, వరంగల్, జనగాం, మహబూబ్ బాద్, రంగారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలకు అధికారులు అరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. 8 జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉండటంతో వాటికి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ చేశారు.
ఇక.. హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురుస్తాయని ముందుగా హెచ్చరించగా.. ఆ గండం కాస్త తప్పినట్టే కనిపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ అల్పపీడనం ఎట్టకేలకు హైదరాబాద్ నగరాన్ని దాటి వెళ్లిపోతుండటంతో.. ప్రమాదమేమి లేదని చెప్తున్నారు. అయినప్పటికీ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతోంది. మూసీ నదికి భారీగా ఇన్ ఫ్లోలు వస్తున్నాయి, ఇప్పటి వరకు తెలంగాణలో 25 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురవగా.. 51 చోట్ల అతి భారీ వర్షాలు.. 120 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పలు చోట్ల 41, 35, 30 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవటం గమనార్హం.