ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతివేగంతో ప్రయాణించడంతో,,,,కేంద్రమంత్రికి ట్రాఫిక్ చలాన్

national |  Suryaa Desk  | Published : Mon, Sep 02, 2024, 11:04 PM

ఎవరైనా సరే రోడ్డుపై వాహనంలో ప్రయాణిస్తున్నారంటే ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిందే. గతంలో ట్రాఫిక్ పోలీసులు ఆపితే డబ్బులు ఇచ్చి, పైరవీలు చేయించి.. ఫైన్లు తప్పించుకునేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు కూడా అప్‌డేట్ అయ్యారు. సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ పరికరాలు ఏర్పాటు చేసి.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి చలాన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కేంద్రమంత్రికి కూడా ట్రాఫిక్ చలాన్ తప్పలేదు. ఆ కేంద్రమంత్రి వెళ్తున్న కారు అతివేగంతో ప్రయాణించడంతో.. ట్రాఫిక్ పోలీసులు ఆ కారుకు చలాన్ వేశారు. ఆయనే లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) అధినేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్.


కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌.. తన సొంత రాష్ట్రం బీహార్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే హాజీపుర్‌ నుంచి చంపారన్‌కు కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే నేషనల్ హైవేపై వెళ్తున్న చిరాగ్ పాశ్వాన్ కారు.. అతివేగంతో దూసుకెళ్లింది. అయితే ఆ కారుకు ఈ- చలానా జారీ అయినట్లు అధికారులు వెల్లడించారు. నేషనల్ హైవేపై నిర్దేశించిన దాని కన్నా అధిక వేగంతో కారు వెళ్లడంతో వెళుతుండగా.. దాన్ని గుర్తించిన ఈ- డిటెక్షన్‌ సిస్టమ్‌.. చిరాగ్ పాశ్వాన్ కారుకు ఆటోమేటిక్‌ చలానాను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ కారుకు రూ.2 వేల ట్రాఫిక్ చలాన్ విధించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ చలానాతో కేంద్రమంత్రికి ఎలాంటి సంబంధం లేదంటూ చిరాగ్‌ పాశ్వాన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


బీహార్‌లోని ఓ టోల్‌ ప్లాజా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్‌ సిస్టం ద్వారా ఈ ట్రాఫిక్ చలాన్‌ జారీ అయినట్లు అధికారులు తెలిపారు. బీహార్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ ఈ-డిటెక్షన్‌ సిస్టంను మోటార్‌ వాహన చట్టం కింద.. ఆ రాష్ట్రంలోని 13 టోల్‌ ప్లాజాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ-డిటెక్షన్ సిస్టం వాహనాలను తనిఖీ చేస్తూ.. సరైన పత్రాలు లేనట్లైతే ఆటోమేటిక్‌గా చలాన్‌ జారీ అవుతుందని అధికారులు వెల్లడించారు. అతివేగంగా వెళ్లడం, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దాని పత్రాల్లో ఏవైనా లోపాలను ఈ- డిటెక్షన్‌ సిస్టమ్ సులువుగా గుర్తిస్తుంది.


ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తుంది. వాహనాల ఫిట్‌నెస్‌, పొల్యూషన్, ఇతర డాక్యుమెంట్‌లలో లోపాలు, అతివేగంగా వెళ్లినప్పుడు చలానా జారీ అవుతుందని అధికారులు తెలిపారు. ఆ ట్రాఫిక్ చలనా నేరుగా ఆ కారు యజమాని సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుందని చెప్పారు. బీహార్‌ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌, ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పటివరకు కొత్త ఈ-డిటెక్షన్‌ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన 16700 మందికి ఈ-చలాన్‌ జారీ చేసినట్లు బీహార్ ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఈ చలాన్ల విలువ సుమారుగా రూ. 9.49 కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com