వరద ముంపులో ఉండిపోయిన బెజవాడ ప్రజానీకాన్ని కాపాడేందుకు మరికొంత మంది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే కేంద్రం నుంచి 25 పవర్ బోట్లు, తొమ్మిది హెలికాప్టర్లతోపాటు వంద మంది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బెజవాడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనగా.. తాజాగా పూణే నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాలు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం పూణే నుంచి ప్రత్యేక విమానంలో ఎన్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాలు గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. నాలుగు హెలికాఫ్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో 120 మంది సిబ్బంది విమానాశ్రయానికి చేరుకున్నాయి. వీరంతా ముంపు ప్రాంతాలకు చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యల్లో పాల్గొననున్నారు. ముంపు బాధితులకు ఆహారం, మంచినీటిని సరఫరా చేయనున్నారు. కాగా.. ఇప్పటికే వందమంది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. సోమవారం కాస్త వర్షానికి విరామం పడంటంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. సముద్ర తీరప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి బోట్లు, హెలికాప్టర్లు తీసుకొచ్చి బాధితులకు ఆహార పదార్థాలు, మందులు, పాలు, నీళ్లు సరఫరా చేశారు. పిల్లలు, వృద్ధులు, రోగులకు అవసరమైన సహాయాన్ని అందజేశారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించారు. సింగ్ నగర్, రాజరాజేశ్వరి పేట, కృష్ణలంక తదితర ప్రాంతాల నుంచి వరద బాధితుల్ని సురక్షిత ప్రాంత ాలకు తరలించారు. కేంద్రం స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపింది. రాష్ట్రంలోని ఎస్డీఆర్‌ఎఫ్, పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వర్షం తగ్గడంతో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. అయితే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టక పోవడంతో కాలనీల్లో రాకపోకలకు ఇబ్బందిగానే ఉంది. ఆదివారం ఐదు అడుగుల మేర ఉన్న నీరు సోమవారం మూడు అడుగులకు చేరిందని కృష్ణలంకలోని పోలీసు కాలనీ వాసులు చెప్పారు. నగర శివార్లలోని పలుప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగానే ఉంది. అలాగే వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పాతిక పవర్ బోట్లు, ఆరు హెలికాప్టర్లు విజయవాడకు చేరుకొన్నాయి. అలాగే వంద మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం తక్షణమే స్పందించి పవర్ బోట్లు, హెలికాప్టర్లతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపించింది. సోమవారం ఉదయానికి ఇవి అందుబాటులోకి వచ్చాయి.