ముంపు ప్రాంతాలైన విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్, జక్కంపూడి కాలనీల్లో ప్రభుత్వం అందించే నిత్యావసరాలు అందడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీరూ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదసాయం అందకపోవడంపై ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. సహాయక కార్యక్రమాలు కేవలం మెయిన్ రోడ్‌కే పరిమితం అవుతున్నాయని, కాలనీల లోపల నివసిస్తున్న వారికి భోజనం సహా ఎలాంటి సౌకర్యాలూ అందడం లేదని వాపోతున్నారు. రూ.5 ఉన్న బిస్కెట్ ప్యాకెట్‌కు వ్యాపారులు రూ.10నుంచి రూ.20వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల కట్టడిలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది అధికారులు వరద సహాయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇప్పటికే సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తాను స్వయంగా పర్యటిస్తున్నా నిర్లక్ష్యం వీడడం లేదంటూ ఆగ్రహించారు. సీఎం చెప్పినటప్పటికీ అధికారుల తీరు మారడం లేదంటూ వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.