భార్యకు డ్రగ్స్ ఇచ్చి, పరాయి వ్యక్తులతో అత్యాచారం చేయించిన భర్తకు సంబంధించిన వ్యవహారం బయటికి రావడం పెను సంచలనంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 72 మందితో తన భార్యపై అత్యాచారం చేయించాడు ఓ దుర్మార్గమైన భర్త. ఇక ఆ 72 మందితో 92 సార్లు రేప్ చేయించాడు. అయితే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరక్కమానడు అనే సామెత ప్రకారం.. కొన్నేళ్ల తర్వాత పట్టుబడ్డాడు. షాపింగ్ మాల్‌లో మహిళలను రహస్యంగా వీడియో తీస్తున్న ఆ వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. విచారణలో భాగంగా అతడి ఫోన్‌ను తనిఖీ చేసిన అధికారులు అవాక్కయ్యారు. అందులో తన భార్యకు సంబంధించిన వీడియోలు ఉండటం చూసి.. గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది.
ఫ్రాన్స్‌లోని ఏవిగ్నాన్ ప్రావిన్స్‌లోని మాజాన్ గ్రామానికి చెందిన 71 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగి.. తన భార్య 72 ఏళ్ల భార్యపై ఇతరులతో అత్యాచారం చేయించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అయితే 2011 నుంచి 2020 మధ్య ఈ ఘటనలు జరిగినట్లు ఫ్రాన్స్ పోలీసులు గుర్తించారు. 2020లో ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఆ వృద్ధుడు.. అక్కడ ఉన్న మహిళలను రహస్యంగా వీడియోలు తీయడాన్ని సెక్యూరిటీ గార్డు కనిపెట్టాడు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు. అతని ఫోన్ చెక్ చేసిన పోలీసులు.. అందులో తన భార్య లైంగిక వీడియోలు ఉండటం చూసి షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే అతని ఇంట్లో తనిఖీలు చేసి కంప్యూటర్‌లో చూడగా వందల కొద్ది ఫోటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ రాత్రి తన భార్య తినే భోజనంలో డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడు. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయిన తర్వాత.. ఇతరులను తన ఇంటికి పిలిపించి భార్యపైనే అత్యాచారం చేయించేవాడు. ఇలా 2011 నుంచి 2020 వరకు మొత్తం 72 మందితో 92 సార్లు అత్యాచారం చేయించినట్లు గుర్తించారు. ఇక ఆమెపై అత్యాచారం చేసిన వారి వయసు 24 ఏళ్ల నుంచి 74 ఏళ్ల మధ్య ఉంటుందని తేల్చారు. మొత్తం 72 మంది ఉండగా.. అందులో 51 మందిని ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు. ఇక వారు తన భార్యపై లైంగిక దాడి చేస్తుంటే.. వాటిని రహస్యంగా వీడియోలు తీసేవాడు. వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
ఇక ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అతడి భార్య షాక్ అయింది. తనకు తెలియకుండానే, తనకు మత్తు మందు ఇచ్చి స్పృహ లేని సమయంలో జరిగిన అకృత్యాల గురించి తెలిసి ఆమె కుమిలిపోలేదు. ధైర్యంగా బయటకి వచ్చి ఇలాంటి ఘటనపై బహిరంగ విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై అందరికీ అవగాహన కల్పించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో మళ్లీ మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని.. అది అందరికీ తెలియాలని ఆమె పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టుకు హాజరయ్యారు.