వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటుచేసే పందిళ్లకు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు ‘హెచ్‌టీటీపీ://గణేష్‌ఉత్సవ్.నెట్’ పేరిట ప్రత్యేకించి ఒక పోర్టల్‌ను రూపొందించారు. తొలుత కలెక్టరేట్‌లో సెల్ ఏర్పాటుచేసి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల ఒకటో తేదీన ప్రారంభించిన ఈ కౌంటర్‌కు మొత్తం 111 దరఖాస్తులు రాగా వాటిని నగర పోలీస్ కమిషనరేట్‌కు పంపారు. ప్రాంతాల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్లే అనుమతులు మంజూరు చేస్తాయని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకునే విధానం మంగళవారంతో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ బుధవారం ప్రారంభించారు. మండపానికి అనుమతి కోసం ప్రత్యేకించి రూపొందించిన వెబ్‌సైట్‌కు వెళ్లి తొలుత రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత పలు విభాగాల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవడంతోపాటు మీ-సేవలో ఈపీడీసీఎల్, జీవీఎంసీ ఫైర్ విభాగాలకు రూ.500 వంతున చెల్లిస్తూ చలానా తీసుకోవాలి. ఇంకా పందిళ్లలో ప్రతిష్ఠించే బొమ్మ ఎత్తు బట్టి...అంటే ఎనిమిది అడుగుల వరకూ రూ.700, 8.1 అడుగుల నుంచి 15 అడుగుల వరకు రూ.1000, 15.1 అడుగుల నుంచి 30 అడుగుల వరకూ అయితే రూ.1400 చలానాను మీ-సేవా కేంద్రంలో చెల్లించాలి. వీటిని ఆయా విభాగాలకు వెళ్లి సమర్పించి ఎన్‌వోసీ పొందాలి. ఇంకా రోడ్లు, భవనాల శాఖ, సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎన్‌వోసీ తీసుకోవాలి. అన్నీ ఎన్‌వోసీలను ఆన్‌లైన్‌లో నమోదుచేసిన రిజిస్ట్రేషన్ ఫారానికి జత చేసి నగర పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సెల్‌లో అందజేయాలి. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే దరఖాస్తును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపిస్తారు. అక్కడ అనుమతి మంజూరుచేస్తూ మండపం ఏర్పాటుకు సర్టిఫికెట్ ఇస్తారు. దీనిపై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. మండపం కొనసాగించే రోజుల్లో ఎవరైనా తనిఖీ చేసినప్పుడు ఆ సర్టిఫికెట్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్‌పై స్కాన్ చేస్తే సరిపోతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.