ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విశాఖ నగరంలో బుధవారం పలు దఫాలుగా వర్షం కురిసింది. ఉదయం మద్దిలపాలెం, సీతంపేట, రామాటాకీస్ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. తిరిగి సాయంత్రం ఒక్కసారిగా వర్షం మొదలైంది. కోస్తా మీదుగా విస్తరించిన రుతుపవనద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారినందున బుధవారం రాత్రి జిల్లాలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక గురువారం పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నందున అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. ఈనెల ఆరు, ఏడు తేదీల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎనిమిదో తేదీ వరకు ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 అప్పుడప్పుడు 55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీయునున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.