మెళియాపుట్టి మండలం, బందపల్లి గ్రామానికి సమీపంలో గల మెళియాపుట్టి-టెక్కలి రోడ్డులో ఉన్న కల్వర్టులో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఎస్ఐ టి.రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. నందిగాం మండలం రామపురం గ్రామానికి చెందిన బదకల కృష్ణుడు(58) శనివారం నర్సింగపల్లి లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లి వస్తానని భార్య దుర్గమ్మకు చెప్పి బయలుదేరాడు. ఆ తర్వాత అతడి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కల్వర్టు వద్ద దుర్వాసన రావడంతో బందపల్లి గ్రామ స్థులు పరిశీలించారు. మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అంద జేశారు. కాగా కృష్ణుడు సారాకు బానిస కావడంతో తరచూ ఇటువైపు వస్తుంటాడని, తాగిన మైకంలో కల్వర్టుపై పడుకొని తూగి పడిపోయి మృతి చెంది ఉండొచ్చన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.