ఎచ్చెర్ల పరిధిలోని పొన్నాడ గ్రామానికి చెందిన అంపోలు అ ప్పారావు (50) అనే వ్యక్తి నాగావళి నదిలో బుధవారం ఉదయం బట్టలు ఉతకడానికి వెళ్లి గల్లంతలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పారావు తన భార్య లక్ష్మి, మరో ఇద్దరితో కలిసి వృత్తిలో భాగంగా బట్టలు ఉతికేందుకు నదికి వెళ్లాడు. బట్టలు ఉతికేందుకు వినియోగించే బండరాయి ఇసుక మేట వేసి మునిగిపోవడంతో దానిని తీసేందుకు ప్రయత్నించి.. వరద నీటికి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు అందరూ కలిసి సాయంత్రం వరకూ వెతికినా.. అప్పారావు ఆచూకీ లభించలేదు. దీంతో అప్పారావు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు.. ఏఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పారావుకు భార్య లక్ష్మి, కుమారుడు ఎర్రన్నాయుడు ఉన్నారు.