గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. గురువారం విజయవాడలోని జక్కంపూడి కాలనీ వరద ప్రభావిత ప్రాంతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.... వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని కొనియాడారు. బాధితులకు సహాయ చర్యలు వేగంగా అందుతున్నాయని తెలిపారు. వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు వేగంగా అందిస్తున్నారని చెప్పారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా వరద ప్రాంతాల్లో పర్యటించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అందరం కలిసి బాధితులను గట్టెక్కించాలని అన్నారు. తాను వరద ప్రాంతాలను పరిశీలించానని శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు.