ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆయన కుటుంబ సభ్యులు వైరల్ ఫీవర్తో ఇబ్బందిపడుతున్నారు. తీవ్ర జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. సూపర్ క్లోరినేషన్ చేపట్టేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.