ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్, దగ్గుతో బాధ పడుతున్నారు. అయినా సరే వరద ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణపై పవన్ తన నివాసంలో అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని.. వెంటనే సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉంటుందన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని.. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఏలేరు రిజర్వాయర్‌కి వరద ముప్పుపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.. వారికి పలు కీలక సూచనలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. 'మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు గౌ|| ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుండి వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్ష్యత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖలు యుద్దప్రతిపదికన పాల్గొంటున్నారు. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడుతామని ఆశిస్తున్నాను'అంటూ ట్వీట్ చేశారు. గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ఉంటున్నారు.. వరద సహాయక చర్యలపై సమీక్షలు చేస్తున్నారు. తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే తాను విజయవాడలో సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.