అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమొక్రటిక్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రత్యర్ధి, రిపబ్లికన్ పార్టీ నేత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టిపోటీ ఇస్తోన్న కమలా హ్యారిస్.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్ని వర్గాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే గ్రాండ్ పేరెంట్స్ డే పురస్కరించుకుని బాల్యంలో తన భారత పర్యటనకు సంబంధించిన ఫొటోను, తన అమ్మమ్మ, తాతయ్యలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘‘చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యలను కలిసేందుకు భారత్‌కు వెళ్లాను. స్వాతంత్య్ర సమరయోధుడైన తాతయ్య ఓ రిటైర్డ్ సివిల్ సర్వెంట్.. ఆయన నన్నూ తనతో పాటు వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. ఆ సమయంలో సమానత్వం, అవినీతిపై పోరాటం వంటి అంశాల ప్రాధాన్యాన్ని వివరించేవారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. అమ్మమ్మ సైతం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కుటుంబ నియంత్రణపై మహిళలకు అవగాహన కల్పించేవారు.. ప్రజాసేవ పట్ల వారి నిబద్ధత, మంచి భవిష్యత్తు కోసం చూపిన పోరాట స్ఫూర్తే నన్ను నడిపిస్తున్నాయి. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్ది, అందరికీ స్ఫూర్తిగా నిలిచే బామ్మలు, తాతలకు గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు’’ అని కమలా హారిస్ ట్వీట్ చేశారు.
కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందినవారు శ్యామల తండ్రే పీవీ గోపాలన్ బ్రిటిష్ ఇండియాలో ప్రభుత్వ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఉన్నత చదువుల కోసం 1958లో అమెరికాకు వెళ్లిన శ్యామల.. 25 ఏళ్ల వయసులో డాక్టరేట్ పూర్తి చేసి రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధనలు జరిపారు. జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్‌ను వివాహం చేసుకున్నారు. వీరి సంతానం కమలా హారిస్, మాయా. అయితే, కమలా హ్యారిస్ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తాతయ్యను స్వాతంత్య్ర సమరయోధుడిని ఎలా అంటారని? ఆయన బ్రిటిష్ ఇంపీరియల్ సెక్రటేరియట్ సర్వీసులో పనిచేసిన ఆయన.. జాతీయోద్యమకారుడు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు.
‘బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో బ్యూరోక్రాట్ ఎలా పాల్గొంటారు.. ఇది సర్వీస్ రూల్స్ ఉల్లంఘనే’ అని ఓ నెటిజన్?. ‘మీరు చెప్పేవన్నీ అబద్దాలే’ అని మరొకరు కామెంట్ చేశారు. అయితే, కమలా హారిస్ తన తాత పివి గోపాలన్ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరని చెప్పడం దే మొదటిసారి కాదు. కానీ రికార్డుల ప్రకారం.. గోపాలన్ 1911లో నాటి మద్రాసు ప్రెసిడెన్సీలోని పైంగనాడులో జన్మించారు. కమలా హ్యారిస్ మామ జి బాలచంద్రన్ మాట్లాడుత.. తన తండ్రి బ్రిటీష్ పాలనను బహిరంగంగా వ్యతిరేకించారని, దీంతో సర్వీసుల నుంచి తొలగించారని చెప్పారు.