దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ వైద్యుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ ఆందోళనల్లో పాల్గొన్న వైద్యురాలి తల్లిదండ్రులు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. ముందునుంచీ ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేయడానికి పోలీసులే ప్రయత్నించారని వారు ఆరోపించారు.
ఆదివారం రాత్రి జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న ట్రెయినీ డాక్టర్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఘటన జరిగి.. దర్యాప్తు మొదలైనప్పటి నుంచి ఈ ప్రభుత్వం, అధికార యంత్రాంగం, పోలీసులు మాకు సహకరించడం లేదు.. ముందునుంచీ సాక్ష్యాలను చెరిపేసేందుకు పోలీసులు యత్నించారు.. అంత సులభంగా న్యాయం జరుగుతుందని మేం భావించడం లేదు. కానీ న్యాయం అందేవరకూ పోరాడుతూనే ఉంటాం. ఈ దేశం మొత్తం మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం.. అదే భరోసాతో మేం పోరాటం సాగిస్తాం’ అని ఆమె అన్నారు.
‘దాదాపు 300 నుంచి 400 మంది పోలీసులు తమను చుట్టిముట్టారు.. మేము ఇంటికి వెళ్లేసరికి అక్కడ 300 మంది దాకా బయట ఉండటం గుర్తించాం.. ఇటువంటి పరిస్థితులు సృష్టించి బలవంతంగా దహనసంస్కారాలు జరిపించేలా చేశారు’ అని వైద్యురాలి తండ్రి అన్నారు. అయితే, ఇంతకు ముందు కూడా పోలీసులపై బాధితురాలి తల్లిదండ్రులు ఇలాంటి ఆరోపణలే చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, హడావుడిగా తమ కుమార్తెకు అంత్యక్రియులు పూర్తి చేయించారని పేర్కొన్నారు.
తమకు ఓ పోలీస్ అధికారి డబ్బులు కూడా ఇవ్వజూపారని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో కోల్‌కతా పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయిి. ఈ క్రమంలోనే కేసు విచారణను సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అప్పగించింది. బాధిత కుటుంబాన్ని రాజకీయ పార్టీలు ఇబ్బందులకు గురిచేయొద్దని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. ‘ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని.. రాజకీయ పార్టీలు వారిని ఇబ్బంది పెట్టకూడదు’ బెంగాల్ మంత్రి శశి పంజా అన్నారు. మరోవైపు, ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. సోమవారం విచారణ జరపనుంది. సీబీఐ తన నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.