విజయవాడలోని జక్కంపూడిలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం పర్యటించారు. వరద బాధితుల ఇళ్లకు నేతలు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. సాయంత్రానికి కాలనీలో అన్ని బ్లాకులకు విద్యుత్ సరఫరా వచ్చేలా చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాధితులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. కాలనీ మొత్తం శానిటేషన్ చేయిస్తామని తెలిపారు. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, బైక్‌లకు ఆయా కంపెనీలతో మాట్లాడి ఉచితంగా రిపేరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటుందని మాటిచ్చారు. బుడమేరు గండి పూడ్చి వరదను అరికట్టామని మంత్రులు వెల్లడించారు.