పౌర విమానయానంపై ఢిల్లీలో రెండు రోజుల పాటు రెండో ఆసియా పసిఫిక్ సివిల్ ఏవియేషన్ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కాగా, ముగింపు కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ఈ నెల 11, 12 తేదీల్లో “భారత మండపం” లో జరిగే సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొంటున్న 41 దేశాలకు చెందిన పౌరవిమానయాన శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధి, 41 దేశాల మధ్య విమాన సౌకర్యాలను మెరుగు పరచడంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మెరుగైన వస్తు రవాణాతో పాటు, పరస్పర సహకారంతో పాటు, అనుభవాలను పంచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. భారత పౌర విమానయానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. గ్రీన్ ఫీల్డ్, ఎయిర్ పోర్ట్‌లు, ప్రయాణ సౌకర్యాలు, ఫ్యూయల్, పౌర విమానయాన వ్యవస్థల అభివృద్ధిపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. చైనా హాజరుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.