వరద బాధితులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరా తీశారు. క్యాంపుల్లోని వైద్యులకు మంత్రి సత్యకుమార్ కీలక సూచనలు చేశారు. స్థానికంగా ప్రజలను కలుసుకుని అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... కాచి చల్లార్చి వడబోసిన నీటినే బాధితులు తాగాలని సూచించారు. వైద్య శిబిరాలకు వచ్చిన వారికి అత్యవసర మందుల కిట్లను పంపిణీ చేశారు. గాయాలతో వైద్య శిబిరాలకు వచ్చే వారికి టీటీ ఇంజక్షన్లను కూడా అందుబాటులోకి తేవాలని ఉన్నతాధికారులకు మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ శిబిరాల ద్వారా అందుతున్న వైద్య సేవలపై బాధితులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి సత్యకుమార్ పరిశీలించారు. తన సొంత నియోజకవర్గం ధర్మవరం నుంచి స్పందన ఆస్పత్రి ఎం.డీ డాక్టర్ బషీర్ తీసుకు వచ్చిన 3వేల దుప్పట్లను వరద బాధితులకు మంత్రి సత్యకుమార్ పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతగా పలు సంస్థల యాజమాన్యాలు బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.