ఏలేరు వరద నీటి ప్రభావంతో ముంపు బారిన పడే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యల అమలు, ఏర్పాట్లపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులను ఆదేశించారు. తిమ్మాపురం శివారు అవంతినగర్, కాలనీ, పి. వెంకటాపురం, పండూరు, సర్పవరం, ఎస్ అచ్చుతాపురం శివారు జనచైతన్య కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలు వరద ముంపుబారిన పడే ప్రమాదం ఉందన్నారు. వరద ముంపుపై ప్రజలను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రదేశాలు, పునరావాస శిబిరాలకు తరలించేందుకు రెవెన్యూ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. పంట కాలువు, గాడేరు కాలువల్లో పూడితతీత ఉంటే తక్షణమే తొలగింపు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాదారపు తాతాజీ, కటకంశెట్టి బాబీ, చోడిశెట్టి ఇంద్ర పాల్గొన్నారు.