గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. అటెండెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా.. రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులు మూడుసారు బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తు్న్నారా లేదా అనే విషయాన్ని స్థానిక ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఉజయం 10 గంటల 30 నిమిషాలకు మొదటిసారి, మధ్యాహ్నం మూడు గంటలకు రెండోసారి, అలాగే సాయంత్రం ఐదు గంటలకు మూడోసారి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఆయితే వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరయ్యేలా చూడాలనే ఉద్దేశంతో మూడు పూటల బయోమెట్రిక్ హాజరు నిబంధన తెచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ విధానం సరిగా అమలు కావడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి తాజాగా ఈ ఆదేశాలు జారీచేసింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై రోజుకు మూడుసార్లు తప్పనిసరిగా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం 2019లో ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. మరుసటి ఏడాది ఉద్యోగులను నియమించింది. అయితే ఉద్యోగుల బదిలీలు మాత్రం చేపట్టలేదు. ఇక ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఉద్యోగుల బదిలీలను చేపట్టింది. అందులో భాగంగా సచివాలయ ఉద్యోగులకు సైతం బదిలీలకు అవకాశం కల్పించింది. అయితే జిల్లా పరిధిలోని ఏ సచివాలయానికైనా బదిలీ అవకాశం చేసుకునేలా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత ఆగస్ట్ నెలాఖరు వరకూ అవకాశం ఇచ్చినప్పటికీ.. పింఛన్ల పంపిణీ, వర్షాలు, వరదల నేపథ్యంలో సెప్టెంబర్ 15 వరకూ ఆ గడువు పొడిగించారు.