ప్రేమికులు ప్రేమలో ఉన్నంతవరకు బాగానే ఉంటారు. కానీ ఒక్కసారి బ్రేకప్ చేసుకున్న తర్వాత.. ఒకరంటే మరొకరు ప్రాణాలు తీసుకునేంత శత్రుత్వం ఉంటుంది. ఇలా నిత్యం మనం ఎన్నో కేసులు చూస్తూనే ఉన్నాం. ప్రియుడిపై ప్రియురాలు.. ప్రియురాలిపై ప్రియుడు.. దాడులు చేయడం, చంపేయడం, టార్చర్ పెట్టడం వంటి ఘటనలు రోజూ వస్తూనే ఉంటాయి. ఇలాంటిదే తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ వద్ద నర్స్‌గా పనిచేసే ఓ యువతి.. క్రమంగా అతడికి దగ్గరైంది. భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఆ డాక్టర్ కాస్తా.. ఆమెతో సన్నిహితంగా ఉండటం ప్రారంభించాడు. దీంతో కొన్ని రోజుల పాటు వారి బంధం సాఫీగానే సాగింది. ఆ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పిన ఆ యువతి.. టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. ఈ ఘటన కాస్తా కోర్టుకెక్కింది. ఇంత చేసినా తన మాజీ ప్రియురాలిపై డాక్టర్ జాలి చూపించడం గమనార్హం.
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఎక్స్‌టన్ అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సోఫీ కాల్‌విల్ అనే 30 ఏళ్ల నర్స్.. 54 ఏళ్ల డెంటర్ దంతవైద్యుడు డేవిడ్ పాగ్లియారో వద్ద పనికి చేరింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించుకున్నారు. 2021లో తన భార్య చనిపోవడంతో డేవిడ్ పాగ్లియారో సోఫీ తోడు కోరుకున్నాడు. అయితే మొదట్లో వీరిద్దరు బాగానే ఉన్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. డేవిడ్‌కు సోఫీ బ్రేకప్ చెప్పింది. అప్పటినుంచి డాక్టర్‌ను టార్చర్ పెట్టడం ప్రారంభించింది. డేవిడ్ పాగ్లియారో ఎక్కడకు వెళ్లినా సోఫీ వెంటపడటం మొదలుపెట్టింది. అంతటితో ఊరుకోకుండా డేవిడ్‌పై నిఘా పెట్టేందుకు అతని కారులో ట్రాకింగ్ డివైజ్ ఏర్పాటు చేసింది. అందుకు అతడి కారుకు ఉండే రెండో తాళాన్ని ఉపయోగించింది.
అయితే సోఫీ తనపై నిఘా పెట్టిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన డేవిడ్.. ఆ ట్రాకింగ్ డివైజ్‌ను తిరిగి ఆమెకే అప్పగించాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు డేవిడ్ ఇంట్లోకి చొరబడిన సోఫీ.. అతడి ఫోన్‌ను దొంగిలించేందుకు తీవ్రంగా యత్నించింది. అయితే అతడు అడ్డుకోవడంతో బెడ్రూం కిటికీలో నుంచి దూకి పారిపోయింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో అతడి ఖరీదైన ఇల్లు కొంత ధ్వంసం అయింది. ఆ ఇంటి విలువ 1.3 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.14 కోట్లు ఉంటుందని అంచనా.
ఇక ఆ తర్వాత రోజు నుంచి డేవిడ్‌కు మరో రకమైన టార్చర్ చూపించింది. ఒక రోజు డేవిడ్‌కు 965 కాల్స్ చేసిన సోఫీ.. మరొక రోజు వెయ్యికి పైగా ఫోన్‌కాల్స్ చేసి తీవ్ర అసహనానికి గురయ్యేలా చేసింది. దీంతో సోఫీ చేసేది తట్టుకోలేకపోయిన డేవిడ్.. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సోఫీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. తనను అన్ని విధాలుగా టార్చర్ చేసినా డేవిడ్ మాత్రం సోఫీపై మంచి అభిప్రాయాన్నే కలిగి ఉన్నాడు. సోఫీపై దయచూపించాలని జడ్జిని కోరాడు. సోఫీని మంచిగా మార్చేందుకు తాను ఎంతో ప్రయత్నించానని.. కానీ అది సాధ్యం కాదని ఇప్పుడు అర్థమైందని కోర్టుకు తెలిపాడు. గతంలో సోఫీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 20 వారాల జైలు శిక్షను కూడా అనుభవించినట్లు చెప్పాడు.