అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు . ఇదే సమయంలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసి విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కామెంట్స్ చేశారు.పల్నాడు జిల్లాలో వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై టీడీపీ నేతలు మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై మేరుగు నాగార్జున స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నంబూరు శంకర్రావుపై దాడి చేయడం హేయమైన చర్య. పల్నాడులో జరుగుతున్న దాడులపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. హోం మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పల్నాడులో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపైన మాత్రం ఆమె మాట్లాడటం లేదు. అధికారం శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోండి. మా పార్టీ కార్యకర్తలు, నాయకులపైన దాడులు, విధ్వంసాలు చేసి భయపెడదాం అనుకుంటే కుదరదు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగటం చాలా దారుణం. మా కార్యకర్తలను కొడుతున్నారని శంకర్రావు ఎస్పీకి ఫోన్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ మీ కార్యకర్తలు ఎందుకు అంత మంది వచ్చారని అడుగుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వందల మంది కర్రలు, రాళ్లు తీసుకుని రోడ్లపైకి వస్తే వాళ్లని ఎందుకు ప్రశ్నించడం లేదు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.