ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లపై చర్చ జరుగుతోంది.. ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏకంగా 7 ఎయిర్‌పోర్టులు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది.. అయితే తాజాగా మరో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై చర్చ మొదలైంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తుల సౌకర్యార్థం మంత్రాలయంలో విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దేశ విదేశాల నుంచి భక్తులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వస్తుంటారు.. వారి సౌకర్యార్థం విమానాశ్రయం నెలకొల్పడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తుంగభద్ర రైల్వేస్టేషన్ నుంచి మంత్రాలయం మీదుగా రైల్వే లైన్ ఏర్పాటును ప్రస్తావించారు.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.
అంతేకాదు మంత్రాలయంలో మఠం ప్రధాన ముఖధ్వారం నుంచి ఉత్తరాన పంచాయతీ కార్యాలయం వరకు.. దక్షిణంలో రాఘవేంద్ర కూడలి వరకు మధ్వమార్గ్‌ను విస్తరిస్తామన్నారు. మంత్రాలయంలో జరిగే అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని స్వామివారు పిలుపునిచ్చారు. అంతేకాదు మంత్రాలయంలో త్వరలోనే మురికి కాల్వల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి పనుల్ని ప్రారంభిస్తామన్నారు.విధంగా కారిడార్ నిర్మాణ సమయంలో వ్యాపారులు ఇబ్బంది పడ్డారని.. అందుకే నెలన్నర అద్దె మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అయితే మధ్వమార్గ్ కారిడార్‌లో వినాయక మండపం ఏర్పాటు చేసి 16 ఏళ్లు అయ్యింది.. అలాగే మఠం పీఠాధిపతిగా సుబుదేంద్రతీర్థులు చాతుర్మాస్య దీక్ష ప్రారంభించి 12 ఏళ్లైన సందర్భంగా వర్తకులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మధ్వమార్గ్ కారిడార్‌లో వినాయకుని మండపం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారికి తులాభారం నిర్వహించారు. స్వామివారి తులాభారం కోసం గోడంబి, ఎండు ద్రాక్ష, కలకండ, బెల్లంను వినియోగించారు. అంతకు ముందు వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు సుబుదేంద్ర తీర్థులు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం ఎంతోమంది ప్రముఖులు తరలివస్తుంటారు. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు కూడా మంత్రాలయం వస్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సుబుదేంద్రతీర్థులు తెలిపారు.