ఆంధ్రప్రదేశ్‌ను మొన్నటి వరకు కృష్ణానది ముంచెత్తితే.. ఇప్పుడు గోదావరి వరద టెన్షన్ పెడుతోంది. ఒక్కసారిగా వరద పెరగడంతో.. గోదావరి తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. వెంటనే అప్రమత్తమైన ఇరిగేషన్‌శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయానికి.. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. బ్యారేజ్ గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రాత్రి 10 గంటల సమయానికి నీటి మట్టం 12.60 అడుగులకు చేరింది.. దీంతో అధికారులు 10.97 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు.
ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయానికి గోదావరి దగ్గర నీటిమట్టం మరికొంత పెరిగింది. ఎగువ రాష్ట్రాల నుంచి కలుస్తున్న వరద జలాలు కొండ వాగులు జలాలతో గోదావరి నీటిమట్టం బుధవారం అనూహ్యంగా పెరిగింది. గోదావరి తీర ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గోదావరి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ అవసరమైన ఆహారం, తాగునీరు, హెల్త్ సర్వీసులు ఏర్పాటు చేశారు. గోదావరిలో చేపల వేటను కూడా నిషేధించారు.. మత్స్యకారులు ఎవరూ నదిలోకి దిగొద్దని హెచ్చరించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే దగ్గర 13.37 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది.
అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పెరుగుతోంది.. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతేకాదు గోదావరి, శబరి నదులకు వరద పెరగడంతో.. ముంపు ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. గోదావరికి వరద పెరుగుతుండటంతో తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.
మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరికి వరద పోటెత్తెంది. ఒక్కసారిగా నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన ఉన్న ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు రావడంతో.. గోదావరిలో నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. భద్రాచలం దగ్గర మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయానికి.. గోదావరి వరద 48 అడుగుల వరకు ఉంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. వెంటనే కరకట్టపై రాకపోకలను నిలిపివేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మురుమూరు దగ్గర గోదావరి పోటెత్తింది. అక్కడ ప్రధాన రహదారిపైకి వరద చేరడంతో కూనవరంతో పాటుగా వర రామచంద్రాపురం మండలాలకు భద్రాచలం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.