నర్సీపట్నం మునిసిపాలిటీలో బాక్సింగ్ రింగ్ ఇండోర్ హాల్ పనులు నిలిచిపోయాయి. స్కేటింగ్ రింక్ ఆవరణలో ఉన్న స్థలంలో బాక్సింగ్ రింగ్, ఇండోర్ హాల్ నిర్మాణం చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో సంబంధిత అధికారులు పనులు ఆపేశారని సమాచారం. బాక్సింగ్ క్రీడాకారులు శిక్షణ తీసుకోవడానికి నర్సీపట్నంలో రింగ్, ఇండోర్ హాల్ నిర్మాణం కోసం 2023లో అప్పటి జిల్లా కలెక్టర్ రూ.60 లక్షలు మంజూరు చేశారు. బాక్సింగ్ రింగ్, ఇండోర్ హాల్ నిర్మాణం కోసం పట్టణంలో పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఎక్కడా సరైన స్థలం లభించకపోవడంతో ఆర్అండ్బీ అధికారులు ఏరియా ఆస్పత్రి ఎదురుగా ఉన్న స్కేటింగ్ రింక్ ఆవరణలోని ఆరు సెంట్ల ఖాళీ స్థలంలో బాక్సింగ్ రింగ్, హాల్ నిర్మాణ పనులను ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. పునాదుల గోతులు తవ్వి, పిల్లర్ల పనులు చేపట్టారు. బాక్సింగ్ రింగ్, ఇతర సామగ్రి సరఫరా టెండర్‌ను నర్సీపట్నంలోని జీఆర్ స్పోర్ట్స్ దక్కించుకుంది. తరువాత ఎన్నికలు జరిగి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా రుత్తల లచ్చాపాత్రుడు నందన వనంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కేటింగ్ రింక్ ఏర్పాటు చేయడానికి అప్పుడు మంత్రిగా వున్న సీహెచ్ అయ్యన్నపాత్రుడు కృషి చేశారు. ఇక్కడ జిల్లా, రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు నిర్వహించడానికి వీలుగా ఉంటుందని భావించారు. కాగా స్కేటింగ్ రింక్ ఆవరణలో ఉన్న స్థలంలో బాక్సింగ్ రింగ్, ఇండోర్ హాల్ నిర్మాణం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ఆర్అండ్బీ అధికారులు పనులు ఆపేశారు.