మెళియాపుట్టి మూడు రోడ్ల కూడలిలో ఉన్న కొత్త చెరువులో అక్రమ నిర్మాణాలు జరుగుతుండడంతో రెవెన్యూ అధికారులు బుధవారం అడ్డుకున్నారు. ఇక్కడ అడుగు రూ.రెండు లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఖాళీ జాగా కనిపిస్తే చాలు..అక్రమార్కులు పాగా వేసేస్తున్నారు. అధికారులు అడ్డుకోకపోవడంతో వీరు ఆడిందే ఆటగా మారిపోయింది. ఈ క్రమంలోనే బుధవారం రూ.20 లక్షల విలువైన స్థలంలో నిర్మాణాలకు కొందరు సిద్ధపడడంతో వీఆర్వో కోటేశ్వరావు వెళ్లి పరిశీలించారు. సర్వే నెంబర్ 348 చెరువు పోరంపోగుగా రికార్డుల్లో ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. నిర్మాణాలకు సిద్ధమైన వారు ఒక డీ పట్టా చూపించారని, అది నకిలీదిగా గుర్తించినట్లు తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని వివరించారు. అంతవరకు పనులు నిలుపుదల చేయలని ఆదేశించినట్లు చెప్పారు. చెరువు గర్భాన్ని మరికొంతమంది ఆక్రమించినట్టు గుర్తించామని, వీటిని తొలగిస్తామని తెలిపారు.