వజ్రపుకొత్తూరు పరిధిలోని పూండి గోవిందపురం గ్రామానికి చెందిన ఏర్నిబాబు అనే వ్యక్తికి ఓ కేసులో రెండేళ్ల సాధారణ జైలు, రూ.11వేలు జరిమానా విధిస్తూ శ్రీకాకుళంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చినట్టు వజ్రపుకొత్తూరు ఎస్ఐ సీహెచ్ రామారావు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్నిబాబు 2019 మార్చి 10న తన భార్యను కొట్టడంతో పొరుగింటికి వెళ్లి తల దాచుకుంది. ఆమెకు ఆశ్రయం ఇచ్చారనే కారణంతో పక్కన ఉన్న పాడల సావిత్రి కుటుంబంపై మరుసటి రోజు ఏర్నిబాబు దాడి చేసి గాయపరిచాడు. సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి హెచ్‌సీ గవరయ్య కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ ఎ .సత్యనారాయణ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసును డిప్యూటీ డైరెక్టర్ మెట్ట మల్లేశ్వరరావు వాదించారు. నిందితుడిపై నేరం రుజువైనందున శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎస్ఎం ఫణికుమార్ తీర్పు ఇచ్చారని ఎస్ఐ చెప్పారు.