చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైందని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఎండగట్టారు. భయపడినంతా అయింది. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టే. ఈ సంక్షోభం సమయంలో ఆయన మౌనం ఎన్డీయే కేంద్రప్రభుత్వానికి ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగా భావించవచ్చు.‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో మహాధృతంగా సాగిన 32 మంది ప్రాణత్యాగం ఉద్యమాల ఫలితమే వైజాగ్ స్టీల్. ఇప్పుడు రక్షించేవారు లేక అనాథ అయిపోయింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టే. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్ లో ఎగిసి పడిన ఒక ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఇక ఛిద్రమైనట్టే. చంద్రబాబు గారి మోసాన్ని, కాపాడే శక్తి ఉన్నా నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు. టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఏ మాత్రం పట్టింపు ఉన్నా చంద్రబాబు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకోవాలి. వైయస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్ ను కంటికి రెప్పలా కాపాడారు. మూత వేయడమే పరిష్కారం కాదని ఆయన అనేకసార్లు ఎలుగెత్తి చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండిలో గాని, NMDC లో గాని విలీనం చేసి, ఇనుప ఖనిజపు గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు మరియు అయన వైఖరే కారణం అనడంలో సందేహం లేదు అని అన్నారు.