లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నాటకీయ పరిస్థితుల నడుమ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. వాస్తవానికి మంగళవారం రాత్రే ఆయన పుత్తూరు శివార్లలోని నివాసానికి చేరుకున్నారని తెలిసింది. కుటుంబీకులతో కలసి ఉంటున్న ఆయన గన్మెన్, పీఏ సహా బంధుమిత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ ఇంటికి అనుమతించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు ఎమ్మెల్యేను కలిసేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏమి జరిగిందన్నది ప్రభుత్వానికి నివేదించాల్సి ఉన్నందున వివరాలు సేకరించడానికి గానూ ఆయనకు ఫోన్ చేసినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇప్పుడే ఇంటికి వచ్చానని చెప్పినట్టు తెలిసింది. తన వయసు 72 ఏళ్లని, హృదయ సంబంధ సమస్యతో స్టంట్ వేయించుకున్నానని వివరించినట్టు సమాచారం. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మాట్లాడలేనని చెప్పినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో తానే తిరుపతి వచ్చి కలుస్తానని దాటవేసినట్టు తెలిసింది.