విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలంలో స్కూల్ కాంప్లెక్స్‌ల కుదింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నాగూరు ఎంపీటీసీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ కోరారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ ఉరిటి రామారావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ స్కూల్ కాంప్లెక్స్‌లను కుదింపు చేసేం దుకు ప్రయత్నాలు జరుగుతున్న సమాచారం ఎందుకు తెలియపర్చలేదని ఎంఈవో ఎన్.నాగభూషణరావును నిలదీశారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ఉపాధి పథకంలో ప్రజలకు ఉపయోగపడే పనులను గుర్తించాలన్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉపయోగపడే మొక్కలను, ప్రజా భాగస్వామ్యంతోనే నాటేలా దృష్టి సారించాలని ఏపీవో ఎం.గౌరీనాథ్‌కు సూచించారు. పంచాయతీల పరిధిలో వీధి దీపాలను ఏర్పాటు చేసే బాధ్యతను సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని రావివలస ఎంపీటీసీ సభ్యులు కె.భరత్‌కుమార్, సత్యనారాయణతో పాటు సుంకి సర్పంచ్ కె.రవీంద్ర కోరారు. దీనిపై విద్యుత్‌శాఖ ఏఈ బి.శంకరరావు స్పందిస్తూ ప్రమాదాలు నెలకొన కుండా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదభరితంగా తయారైందని సంతోషపురం సర్పంచ్ అంబటి తవిటినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జేఈ పి.ప్రమీల స్పంది స్తూ రహదారికై రూ.15 కోట్లుతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మండలానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు రూ. 40 కోట్లుతో ప్రతిపాదనలు చేశామని పంచాయతీ జేఈ గౌరీశంకరరావు తెలిపారు. ఉపాధి ఏపీవో గౌరీనాథ్ మాట్లాడుతూ 25 పంచాయతీల పరిధిలో 3,113 పనులు గుర్తించామని, ఆమోదానికి జిల్లా అదికారులకు నివేదిస్తా మని చెప్పారు. ఏవో ఆర్.విజయభారతి మాట్లాడుతూ మండలానికి 14 వేల ఎకరాల్లో ఈ-క్రాప్ నమోదు పూర్తయిందని, ఈనెల 15లోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ రామారావు మాట్లాడుతూ సభ్యులు తెలియపర్చిన సమస్యలను సకాలంలో పరిష్కారమయ్యేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశానికి ముందుగా కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి మృతికి సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీడీవో పి.పైడితల్లి, ఈవోపీఆర్‌డీ ఎల్.గోపాలరావు, ఇన్‌చార్జి తహసీల్దార్ సత్యలక్ష్మికుమార్, ఏవో ఎన్.అర్జునరావు, పి.శ్రావణి, రాజేష్, వి.అఖిల్‌నాయుడుతో పాటు పలు శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.