పొన్నూరు వైసీపీ ఇంఛార్జి అంబటి మురళిపై టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మురళి ఎలాంటి అనుమతి లేకుండా బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారన్నారు. 2015లో 15 అంతస్తుల కోసం ప్లాన్ దరఖాస్తు చేశారని.. ఇప్పటి వరకూఎలాంటి అనుమతి కార్పోరేషన్ నుంచి రాలేదన్నారు. మొదట్లో 5 అంతస్తుల కోసం అనుమతి తీసుకుని తర్వాత 15 అంతస్థులకు పెంచారన్నారు. రివైజ్డ్ ప్లాన్‌కు అనుమతి లేకుండా నిర్మాణం చేస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనంగా ఉన్నారన్నారు. దాదాపు 10 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించకుండా నిర్మాణాలు చేస్తుంటే కార్పోరేషన్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ భవనాలు రైల్వే ట్రాక్ ఆనుకుని నిర్మిస్తున్నారన్నారు. రైల్వే నుంచి కూడా కేవలం 5 అంతస్తుల వరకూ మాత్రమే నిరభ్యంతర పత్రం ఇచ్చారన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిరభ్యంతర పత్రం రద్దు చేస్తామని రైల్వే చెప్పిందన్నారు. గత ఐదేళ్లుగా అన్ని ప్రభుత్వ శాఖలు అక్రమ నిర్మాణాలకు సహకరించారని ఆరోపించారు. గుంటూరు నగరం నడిబొడ్డున నిర్మాణాలు జరుగుతుంటే చోద్యం చూశారని మండిపడ్డారు. సామాన్యులుఎవరైనా అనుమతి లేకుండా ఇళ్లు కడితే వాళ్లను నానా ఇబ్బందులు పెట్టే అధికారులు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబటి మురళి అక్రమంగా నిర్మిస్తున్న భవనంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా తమపై ఎన్నో ఆరోపణలు చేశారని, కేసులు పెట్టి వేధించారని గుర్తుచేశారు. తనిఖీలు ఎదుర్కొనేందుకు తమ సంగం డెయిరీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అంబటి మురళి అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నానని తెలిపారు. రైల్వేకు ఓ ప్లాన్, కార్పోరేషన్‌కు మరో ప్లాన్ సమర్పించి నిర్మాణాలు చేస్తున్నారన్నారు. పథకం ప్రకారం వందలాది మంది వినియోగదారులను అంబటి మురళి మోసం చేశారన్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యలు చేశారు.