వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగిందని.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు. వరదల విషయంలో ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోక పోగా .. ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. గత ఐదేళ్లుల్లో జగన్ పాలనే మన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తన్నారు. వారి నిర్లక్ష్యం, వారి పాపాల వల్లే నేడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. మూడు నెలల కూటమి పాలన చూస్తేనే జగన్ తట్టుకోలేక పోతున్నారన్నారు. ప్రజలను ఆదుకోవాలన్న మనసు జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు.జగన్, కానీ వైసీపీ నాయకులు కానీ ప్రజలకు ఏ విధంగా సేవలు అందించారో చెప్పాలన్నారు. పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞాని లాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావుడి చేశారన్నారు.వైసీపీ పాలనలో విపత్తులు వస్తే.. పవన్ కళ్యాణ్ ఏనాడూ రాజకీయ విమర్శలు చేయలేదని గుర్తుచేశారు. పిఠాపురంలో జగనన్న కాలనీ ఎందుకు పరిశీలించలేదని నిలదీశారు. ఏలేరు గురించి జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారని.. ఐదేళ్లు ఎందుకు చేయలేదని అడిగారు. వర్షాలు ఎక్కువుగా పడినందువల్ల చేయలేదని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. జగన్ ఏనాడైనా జేబులో నుంచి లక్ష రూపాయలకు సామాన్యునికి సాయం చేశారా అని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి.. ప్రజలకు కనిపించకుండా పరదాలు కప్పుకుని తిరిగారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదా.. దీనికి గురించి జగన్‌కు మాట్లాడే అర్హత ఉందా అని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షునిగా ఉన్న జగన్.. మీ పార్టీ శ్రేణులను వరద సహాయక చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.