సెబ్‌ను రద్దు చేస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎక్సైజ్ శాఖ అధికారుల హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ నేత నరసింహం మాట్లాడుతూ... ‘‘మా ప్రమేయం లేకుండా, మా అభిప్రాయలు తీసుకోకుండా వైసీపీ ప్రభత్వం సెబ్ ఏర్పాటు చేసింది’’ అంటూ మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖలో 70 శాతం సిబ్బందిని సెబ్‌లోకి పంపి.. తమ శాఖను నిర్వీర్యం చేసిందన్నారు. తమకు ఎటువంటి అధికారాలు లేకుండా కోత పెట్టారని తెలిపారు. సెబ్ వల్ల ప్రయోజనం లేకపోగా... ఏపీలో అక్రమ మద్యం, గంజాయి రవాణా పెరిగిపోయిందన్నారు. ఇందుకు భారీగా పెరిగిన కేసులు సంఖ్య చూస్తే అర్థం అవుతుందన్నారు. సంస్కరణలు తేవాలంటే.. ముందుగా కమిటీలతో అభిప్రాయ సేకరణ చేయడం పరిపాటిఅని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా నిర్ణయాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాను ప్రోత్సహించేలా చేసిందని ఆరోపించారు. తప్పులు జరుగుతున్నట్లు తెలిసినా.. తాము దాడులు చేసే అధికారం లేకుండా చేశారననారు. సెబ్ పేరుతో అక్రమాలను ప్రోత్సహించి.. ప్రభుత్వ ఆదాయలకు గండి కొట్టారని... దీనిపై అనేకసార్లు జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. తమ విజ్ఞప్తులు, విన్నపాలను పరిశీలించిన కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే సెబ్ రద్దు చేయడం శుభపరిణామమన్నారు. ఎక్సైజ్ శాఖలోకి రావడం.. కన్న తల్లి దగ్గరకు వచ్చామనే ఆనందం ఉద్యోగుల్లో ఉందన్నారు. ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తేవడం, అక్రమాలు అరికట్టే విధంగా ఎక్సైజ్ శాఖ పని తీరు ఉంటుందని నరసింహం స్పష్టం చేశారు.