ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చింది.. ఓ నేత ఆఫర్ ఇచ్చారు: నితిన్ గడ్కరీ

national |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 10:39 PM

ప్రధాని మంత్రి పదవిపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని పేర్కొన్నారు. ప్రధాని రేసులో ఉంటే, ప్రతిపక్షాలు తనకు మద్దతు ఇస్తానని ఆఫర్ చేశాయన్నారు. నాగ్‌పూర్‌లో శనివారం జరిగిన జర్నలిజం అవార్డుల వేడుకకు నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకసారి ఓ నాయకుడు నా వద్దకు వచ్చాడు... మీరు ప్రధాని పదవి రేసులో నిలబడితే మేమంతా మీకు మద్దతు ఇస్తామని ఆయన నాతో చెప్పారు.. కానీ, ప్రధాని కావడం నా లక్ష్యం కాదు.. నేను అనుకున్నదానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయనతో కరాఖండీగా చెప్పాను’ అని అన్నారు.


 అయితే, తనను కలిసిన నెత ఎవరు.. ఈ ఆఫర్ ఇచ్చింది ఎప్పుడు అనే వివరాలను మాత్రం గడ్కరీ బయటపెట్టడకపోవడం గమనార్హం. అయితే, ఈ ఘటనను తాను గుర్తించుకున్నానని, ఆ వ్యక్తి పేరు చెప్పనని పేర్కొన్నారు. ‘నాకు ఎందుకు మద్దతు ఇస్తారు?.. మీ మద్దతును నేనెందుకు అంగీకరించాలి అని ప్రశ్నించాను.. ప్రధాని కావడం నా లక్ష్యం కాదు.. నేను నా విలువలు.. నా సంస్థకు విధేయుడిగా ఉంటాను.. నా నమ్మకాలు నాకు చాలా ముఖ్యమైనవి కాబట్టి నేను ఏ పదవి కోసం రాజీ పడను’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు.


కాగా, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిత్వంపై నితిన్ గడ్కరీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో నిర్వహించిన మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో ప్రధాని పదవి రేసులో తొలి రెండు స్థానాల్లో నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఉండగా.. గడ్కరీ మూడో స్థానంలో నిలిచారు. అయితే, 2019 ఎన్నికల సమయంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. మేమంతా ఆయన వెనుకే ఉంటామని, ఆయన దార్శనికతను నెరవేర్చడంలో నేనూ మరో కార్యకర్తను అని పేర్కొన్నారు. నాకు ప్రధాని కావాలనే కల ఎప్పుడూ లేదని కొట్టిపారేశారు.


ఇక, బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ.. వరుసగా మూడుసార్లు నాగ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయనకు ఆర్ఎస్ఎస్‌ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా ఆయన రికార్డు నెలకొల్పారు. 2014 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇక, బీజేపీ జాతీయాధ్యక్షుడిగా 2009 నుంచి 2013 వరకూ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com