రాబోయే 25 ఏళ్లలో డ్రగ్-రెసిస్టెంట్ సూపర్‌బగ్ ఇన్‌ఫెక్షన్లు కారణంగా దాదాపు 40 మిలియన్ల మంది ప్రాణాలు పోతాయని ఓ అధ్యయనం అంచనా వేసింది. ఈ భయంకరమైన దృష్టాంతాన్ని నివారించడానికి పరిశోధకులు చర్య తీసుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు అధ్యయన ఫలితాలను ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో సోమవారం ప్రచురించారు. యాంటీబయాటిక్స్‌కు నిరోధకంగా మారిన బ్యాక్టీరియా లేదా వ్యాధికారక జాతులైన సూపర్‌బగ్‌లు.. చికిత్సలను చాలా కష్టతరం చేస్తాయి. వీటిని ప్రపంచ ఆరోగ్యానికి పెరుగుతున్న పెను ముప్పుగా గుర్తించారు.
కాలక్రమేణా ప్రపంచంపై సూపర్‌బగ్‌ల ప్రభావం? తరువాత ఏం జరుగుతుంది? అనేది అంచనా వేయడానికి ఈ అధ్యయనం కీలకంగా మారింది. సూపర్‌బగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 1990 నుంచి 2021 మధ్య ఏడాదికి పది లక్షల మందికిపైగా చనిపోయినట్టు అధ్యయనం గుర్తించింది. శిశువుల అంటువ్యాధుల నివారణ, నియంత్రణకు తీసుకున్న మెరుగైన చర్యల కారణంగా గత మూడు దశాబ్దాల్లో సూపర్‌బగ్‌ల వల్ల ఐదేళ్లలోపు పిల్లల మరణాలు వాస్తవానికి 50 శాతానికి పైగా తగ్గాయని అధ్యయనం తెలిపింది.
అయితే, పిల్లలు సూపర్‌బగ్‌ల బారినపడితే ఇన్‌ఫెక్షన్‌లకు చికిత్స చేయడం చాలా కష్టమని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, గత మూడు దశాబ్దాల్లో 70 ఏళ్లు పైబడిన వారి మరణాలు 80 శాతానికి పైగా పెరిగాయి. ఇది వృద్ధ జనాభాకు మరింత హాని కలిగిస్తుంది. అనేక యాంటీబయాటిక్స్‌కు నిరోధకతను కలిగి ఉన్న ఒక రకమైన స్టాఫ్ బ్యాక్టీరియా ఎంఆర్ఎస్ఏ ఇన్‌ఫెక్షన్ల మరణాలు రెట్టింపయ్యాయని, ఇవి 2021 నాటికి ఏడాదిలో 130,000గా ఉన్నాయని అధ్యయనం తెలిపింది.
ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే సూపర్‌బగ్ కారణంగా ప్రత్యక్ష మరణాల సంఖ్య 67 శాతం పెరిగి 2050 నాటికి ఏటా మరణాల సంఖ్య దాదాపు రెండు మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. శాస్త్రవేత్తల అధ్యయన నమూనా ప్రకారం.. మరో 8.2 మిలియన్ల వార్షిక మరణాలలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వచ్చే 25 ఏళ్లలో దీని వల్ల 39 మలియన్ల మంది ప్రాణాలు కోల్పోతారని, మొత్తం 169 మిలియన్ల మరణాలకు దారితీస్తుందని నిర్దారణకు వచ్చింది.
అయితే, దీని తీవత్రను కూడా తగ్గించవచ్చని అభిప్రాయపడింది. తీవ్రమైన అంటువ్యాధుల సంరక్షణను మెరుగుపరిచే యాంటీమైక్రోబయల్ ఔషధాలను పొందడానికి ప్రపంచం కృషి చేస్తే 2050 నాటికి 92 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొంది. ‘దశాబ్దాలుగా యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ( ఏఎంఆర్) ప్రపంచ ఆరోగ్యానికి గణనీయమైన ముప్పుగా ఉంది.. ఈ ముప్పు పెరుగుతోందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి’ అధ్యయన కో-ఆథర్, అమెరికా సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ పరిశోధకుడు మోహసేన్ నఘవి పేర్కొన్నారు.
తమ అధ్యయనంలో భాగంగా 22 వ్యాధికారక కారకాలు, 84 రకాల యాంటీబయాటిక్ ఔషధాలు, మెనింజైటిస్ వంటి 11 ఇన్ఫెక్షియస్ సిండ్రోమ్‌లను పరిశీలించారు. మొత్తం 204 దేశాల్లోని 520 మిలియన్ల మంది వ్యక్తిగత రికార్డుల ఆధారంగా డేటాను సేకరించారు. సెప్టెంబర్ 26న జరగనున్న ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి ఏఎంఆర్ సమావేశానికి ముందు నివేదిక విడుదల చేయడం గమనార్హం. యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ అనేది సహజమైన అంశం. కానీ మానవులు, జంతువులు, మొక్కలలో యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం, దుర్వినియోగం సమస్యను మరింత తీవ్రతరం చేసింది.