బద్రీనాథ్ యాత్రలో తెలుగు యాత్రికుల ఇబ్బందులు అంతకంతకు పెరుగుతున్నాయి. చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై గౌచర్ , కర్ణప్రయాగ్ మధ్య ఈ ప్రాంతంలో పదేపదే కొండచరియలు విరిగి పడుతున్నాయి.అంతేకాదు రుద్రప్రయాగ దగ్గర కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రుద్ర ప్రయాగ సమీపంలో రోడ్డు బ్లాక్ అయింది. రహదారిపై రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు కర్ణప్రయాగ్‌లో దాదాపు 250-300 వాహనాలు చిక్కుకున్నాయని, గౌచర్‌లో 200 వాహనాలు చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు.
సోమవారం నుంచి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు భోజన, వసతి ఏర్పాట్లు చేస్తున్నమని స్థానిక అధికారులు వెల్లడించారు. అంతేకాదు కర్ణప్రయాగ్ , గౌచర్లలో ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి దృష్ట్యా, బద్రీనాథ్ నుండి వచ్చే వాహనాలను నందప్రయాగ్, చమోలి, పిపాల్కోటి, జోషిమటం దగ్గర నిలిపివేస్తున్నారు. గౌచర్‌కు వెళ్లే వాహనాలను రుద్రప్రయాగ్‌లో నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు
కొండచరియలు విరిగి పడ్డ సమయంలో దాదాపు 40 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు రుద్రప్రయాగ సమీపంలోనే చిక్కుకుపోయారు. ఆహారం, నీళ్లు లేక నరకం అనుభవిస్తున్నారు. యాత్రికుల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చల్లావారిపల్లి గ్రామానికి చెందిన వాళ్లున్నారు. కొండచరియలు విరిగి పడ్డ సమయంలో అక్కడే ఉన్నారు. ఈ విషయాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి ఫోన్‌లో సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి రెండు బస్సులను పంపించారు.
ప్రతికూలం వాతావరణం కారణంగా కేదార్‌నాథ్ దర్శనం అనంతరం తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడగా బద్రీనాథ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. యాత్రికులతో టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని భరోసానిచ్చారు. అధికారులతో ఇప్పటికే మాట్లాడామని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. హెలికాప్టర్ సర్వీసులు నిలిపివేయడం.. వర్షాలు, తీవ్ర చలితో తెలుగు యాత్రికులు అవస్థలు పడుతున్నారు