ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ ఇటీవల వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోకి తిరుమల లడ్డూ వివాదం తెగ చర్చనీయాంశంగా మారింది. దీంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు తిరుపతి లడ్డూపైనే చర్చ జరుగుతోంది. దేశంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, తిరుమల పవిత్రతకు భంగం కల్గించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన తమిళనాడులోని ఎన్‌టీకే పార్టీ అధినేత సీమాన్ స్పందించారు.
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని వస్తున్న ఆరోపణల వేళ.. సామాన్య భక్తుల దగ్గరి నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని విశ్వాసాన్ని అపహాస్యం చేశారని కొందరు మండిపడుతుంటే.. మరికొందరు మాత్రం తిరుమల లడ్డూ విషయంలో అనవసర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు ఎన్‌టీకే పార్టీ అధినేత, నటుడు సీమాన్ తిరుమల లడ్డూ విషయంలో తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో తిరుమల లడ్డూ తప్ప ఇంకా ఏ సమస్యలు లేవా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇక తిరుమల లడ్డూ కల్తీ అయిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. అంతేకాదు తప్పు జరిగితే చర్యలు తీసుకోండి కానీ.. లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని సీమాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి లడ్డూ కాకుండా ఇతర సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తీవ్ర సంచలనంగా మారడంతో సీమాన్‌పై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.