ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి ఎదురుగాలి విస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మొన్నటి వరకు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోయిన ఆయన చివరికి జనసేనవైపు మొగ్గు చూపారట.
మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆదివారం జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారట. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కిలారి రోశయ్య జనసేన కండువా కప్పుకోబోతున్నారు. రోశయ్య టీడీపీలోకి వెళ్లాలని భావించారు.. కానీ అక్కడ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో జనసేనలోకి వెళుతున్నారు. ఇటీవల ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గుంటూరు ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
కిలారి రోశయ్య రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు.. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. అలాగే రోశయ్య తండ్రి తండ్రి కిలారి కోటేశ్వరరావు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు కౌన్సిలర్‌గా, చైర్మన్‌గా పనిచేశారు. 1989లో కోటేశ్వరరావు గుంటూరు-2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి రాజకీయ వారసుడిగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. 1985లో జేకేసీ కాలేజీలో ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . 1993లో గుంటూరు మిర్చి యార్డు సంఘం ఉపాధ్యక్షుడిగా.. 1994లో గుంటూరు మిర్చి యార్డు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి.. 2009 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీచేసిఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు పొన్నూరు టికెట్ దక్కలేదు.. ఆయన్ను గుంటూరు ఎంపీగా పోటీ చేయించగా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు.
మరోవైపు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా ఆదివారం జనసేన పార్టీలో చేరనున్నారు. ఆయన కూడా శుక్రవారం వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు.. అనుచరులతో చర్చించిన తర్వాత జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయభాను తనతో కలిసి రావాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. వెంటనే ఆయనకు మద్దతుగా జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్‌లోని 12 మంది వైెస్సార్2సీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు.