తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తిరుపతి లడ్డూ వివాదం అగ్గి రాజేస్తోంది. తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబే కామెంట్ చేయటంతో.. ఏపీ, తెలంగాణతో పాటు దేశమంతా ఈ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే.. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రంలో భక్తులకు అందించే స్వామివారి ప్రసాదమైన తిరుపతి లడ్డూలో ఇలాంటి అపవిత్రమైన పని జరిగిందని ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాల్లోని హిందువులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి లడ్డూలో ఏకంగా అంబర్ ప్యాకెట్ దర్శనమిచ్చింది. ఈ ఘటన.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.
ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటోన్న దొంతు పద్మావతి అనే మహిళ.. సెప్టెంబర్ 19వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి.. శ్రీవారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంది. ఇక.. తిరిగి వచ్చేటప్పుడు బంధువులతో పాటు, ఇరుగు పొరుగు వారికి పంచేందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చింది. ఆదివారం (సెప్టెంబర్ 22న) రోజున లడ్డూ ప్రసాదాన్ని పంచేందుకు బయటకు తీయగా.. అందులో గుట్కా ప్యాకెట్ కనిపించింది.
అత్యంత పవిత్రమైన లడ్డూలో ఎవరైనా జీడిపప్పు, కిస్మిస్, యాలాకులో రావటం చూసుంటారు.. కానీ ఏకంగా గుట్కా (అంబర్) ప్యాకెట్ రావటం చూసిన పద్మావతి.. అవాక్కయింది. ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పటంతో.. ఆ దారుణాన్ని ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు. అచ్చంగా ఇలాగే.. 2012లోనూ తిరుపతి లడ్డూలో గుట్కా ప్యాకెట్ దర్శనమివ్వటం గమనార్హం.
ఇప్పటికే.. లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ అయ్యిందంటూ ఊదరగొడుతున్న వేళ.. ఈ అంబర్ ప్యాకెట్ దర్శనమివ్వటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. నెయ్యి అంటే.. అన్ని టెస్టులు చేసి లోపలికి వస్తుంది కగా.. తయారూ చేసే వాళ్లు గుడ్డిగా ఉపయోగించారనుకుందాం.. కానీ.. లడ్డూలు కట్టే సమయంలో ఎవరో ఒకరు గుట్కా ప్యాకెట్ తీసుకురాకపోతే.. అందులోక అంబర్ ప్యాకెట్ ఎలా వస్తుందన్నది ఇప్పుడు అందరి మొదళ్లలో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. తయారు చేసే స్థలంలోనే ఎవరో గుట్కా వాడుతున్నారన్నది అర్థమవుతోంది.
అత్యంత పవిత్ర ప్రదేశంగా భావించే తిరుమల కొండలపై గుట్కాలు, మద్యం, దూమపానం, మాంసం లాంటి కఠినంగా నిషేదం. కానీ.. ఏకంగా తిరుపతి లడ్డూలోనే ఇలా గుట్కా ప్యాకెట్ రావటం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎవరో భయటనుంచి వచ్చే భక్తులు కాదు.. అందులో పని చేసే నమ్మకమైన సిబ్బందిలోనే ఎవరో కలుపుమొక్కలు ఇలాంటి అపచారపు పనులు చేస్తూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం పేరును అబాసుపాలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. అసలు.. ఇదంతా నిజమేనా అని మరికొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కల్తీ నెయ్యి వివాదం రాజుకుంటున్న సమయంలోనే.. కొందరు కావాలనే ఇలా చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.