2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చింది. ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలకు రూ.1500, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి గ్యారంటీలు ఇచ్చారు. అలాగే బడికి వెళ్లే విద్యార్థులకు ఏడాదికి రూ.15000 చొప్పున అందిస్తామంటూ తల్లికి వందనం పేరిట మరో హామీ ఇచ్చింది టీడీపీ కూటమి. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే వారందరికీ ఏడాదికి 15 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రశ్నించారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్.. ఆ సమావేశంలోనే సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకం అమలు గురించి ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్లారిటీ ఇచ్చారు. అలాగే వైఎస్ జగన్ ఆరోపణలకు సైతం కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎంత మంది పిల్లలు ఉంట అంత మందికీ రూ.15000 చొప్పున ఇస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నిస్తున్న వైఎస్ జగన్.. అమ్మ ఒడిని ఎప్పుడు అమలుచేశారో గుర్తుచేసుకోవాలన్నారు. 2019లో అధికారంలోకి వస్తే 2020లో అమ్మ ఒడి పథకాన్ని వైసీపీ అమలు చేసిందని గుర్తుచేశారు. తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత, హక్కు వైఎస్ జగన్‌కు లేదన్నారు. ఎన్డీఏ కూటమి పాలన వందరోజులు పూర్తయిన సందర్భంగా పాలకొల్లు మండలం భగేశ్వరం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు సూపర్ సిక్స్ హామీల్లో ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని మాత్రం దీపావళి నుంచి అమలు చేయనున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామన్న చంద్రబాబు.. ఆ రోజే తొలి కనెక్షన్ అందిస్తామన్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణం, నెలకు రూ.1500 పథకాలను అమలు చేయడంపైనా ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. వీలైనంత త్వరగా ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తు్ననారు.