ఇచ్ఛాపురం పట్టణంలోని రైల్వేఎల్సీ గేటు సమీపంలో ఒడిశాలోని గంజాం జిల్లా ఖాండూరుకు చెందిన శంకర్ సాహు నుంచి పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. సోమవారం ఇచ్ఛాపురంలో సీఐ విలేకరులతో మాట్లాడారు. సీఐ కథనం మేరకు.. గుంటూరు ప్రాంతంలో శంకర్ సాహు టైల్స్ మేస్ర్తీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన నానితో పరిచయం ఏర్పడింది. ఆయనకు గంజాయి అవసరమైన సమయంలో శంకర్సాహు ఒడిశా నుంచి తీసుకువెళ్లే వాడు. కిలో సుమారుగా రూ.ఎనిమిది వేలకు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా గస్తీకి వెళ్లిన ఎస్ఐ ఈ.చిన్నంనాయుడు, సిబ్బంది శంకర్ సాహును అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు ఆయన నుంచి 10 కేజీల 470 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.