ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో తొలి వందే మెట్రో.. ఆ రూట్లో పరుగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 08:40 PM

రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలో వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం కోసం ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తేనుంది. తాజాగా వందే మెట్రో పేరుతో తక్కువ దూరం ఉండే నగరాల మధ్యన నడిపేలా కొత్త రైలును కూడా ప్రవేశపెట్టారు. గుజరాత్‌లోని భుజ్- అహ్మదాబాద్ మధ్యన దేశంలోనే తొలి వందే మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఏపీలోనూ వందే మెట్రో (నమో భారత్ రైలు) పరుగులు తీయనుంది. ఈ విషయమై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్లారిటీ రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.


విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ డీఆర్ఎమ్ మీటింగ్ సోమవారం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారు. సమావేశంలో ఉత్తరాంధ్ర రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు. అలాగే రోజువారీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం- విశాఖపట్నం మార్గంలో వందే మెట్రో రైలును ప్రారంభించాలని రైల్వే అధికారులకు రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నుంచి విశాఖకు వివిధ పనుల కోసం రోజువారీ ప్రయాణాలు చేసే వారు అధికమని.. వారిని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం- విశాఖ నమో భారత్ రైలును నడపాలని కోరారు. అలాగే శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్, తిరుపతికి కొత్త రైలు సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇక రైల్వేలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, ప్రయాణీకులకు మరిన్ని సౌకర్యాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం వాల్తేరు డీఆర్ఎం డివిజన్ ఛైర్మన్‌గా కింజరాపు రామ్మోహన్ నాయుడుని ఎన్నుకున్నారు.


మరోవైపు తక్కువ దూరం ఉన్న పట్టణాల మధ్య ఈ వందే మెట్రో రైళ్లను అందుబాటులోకి తేనున్నారు. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో నమో భారత్ రైళ్లు తేవాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ వందే మెట్రో రైలు అన్ రిజర్వ్‌డ్ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక కూర్చుని 1150 మంది, నిలబడి 2 వేల మంది ఒకేసారి ప్రయాణించేలా ఈ వందే మెట్రో రైలును రూపొందించారు. మెట్రో రైళ్ల తరహాలోనే ఆటోమేటిక్ తలుపులు ఏర్పాటు చేశారు. లగేజీని ఉంచేందుకు అల్యూమినియం ర్యాక్‌లు, మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్లను కూడా ఈ వందే మెట్రో రైలులో ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com