ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. వికేంద్రీకరణ విధానంలో రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ధాన్యం సేకరణ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లపై గైడ్లైన్స్ జారీ చేసింది. ఈ- క్రాప్, ఈ - కేవైసీ ద్వారా రైతులు, కౌలు రైతుల నుంచి వివరాలు సేకరించాలని స్పష్టం చేసింది. వీటి ద్వారానే ధాన్యం కొనుగోళ్ల తర్వాత రైతులకు చెల్లింపులు జరపాలని ఆదేశించింది. ఇక ధాన్యం కొనుగోళ్లకు ఏపీ పౌరసరఫరాలశాఖ, మార్క్ ఫెడ్ సంస్థలు నోడల్ సంస్థలుగా పనిచేయనున్నాయి.
మరోవైపు ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో రైస్ మిల్లర్లకు కూడా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ధాన్యం సేకరణకు ఉద్దేశించిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో నమోదు కావాలని సూచించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ధాన్యం సేకరణత పాటుగా మిల్లింగ్ ఆపరేషన్లు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశించింది. మరోవైపు కేంద్రం నిర్దేశించిన కనీస మద్దతు ధర ప్రకారం కామన్ వెరైటీ క్వింటాలుకు రూ.2300, గ్రేడ్ ఏ రకానికి రూ.2320 రూపాయలు చొప్పున చెల్లించనున్నారు.
మరోవైపు అక్టోబర్ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే వెల్లడించారు. అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని ఇటీవల నిర్వహించిన వర్క్ షాపులో తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని.. ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతు ఇష్టానికే ప్రాధాన్యం ఇస్తామని మంత్రి వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే లారీలు, గన్నీబ్యాగులను సైతం సిద్ధం చేసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.