ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతుసేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఈ -పంట, ఈ కేవైసీ ద్వారా రైతులు, కౌలు రైతుల వివరాలను ధాన్యం కొనుగోళ్లకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ అనుసంధానంతో ఈ - పంట, ఈ -కేవైసీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ఏపీ మార్క్‌ఫెడ్ సంస్థలు రాష్ట్రస్థాయి ధాన్యం కొనుగోళ్లకు నోడల్ సంస్థలుగా పనిచేస్తాయని స్పష్టం చేసింది.
ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌లో నమోదు కావాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్ధతు ధర కామన్ వెరైటీ క్వింటాలుకు రూ.2300 , గ్రేడ్ ఏ రకానికి రూ.2320 క్వింటాలుకు చెల్లించాలని తెలిపింది. 2024-25 ఖరీఫ్ సీజన్‌కు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు స్పష్టం చేసింది. సేకరణతో సహా, మిల్లింగ్ ఆపరేషన్లపై పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.