జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ మేరకు మొత్తం 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు అధికారులు పోలింగ్ ఏర్పాటు చేశారు.మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా , బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా సహా పలువురు కీలక నేతలు రెండో దశ ఎన్నికల బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతలు అదుపు తప్పకుండా రాజౌరీ సహా పలుచోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. పీర్ పంజాల్ పర్వతానికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటలకు కొనసాగనుంది. మొత్తం ఆరు జిల్లాల పరిధిలో 25,78,000 ఓటర్లు తమ ఓటు హక్కును వియోగించుకోనుండగా.. 239 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ సందర్భంగా రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. కాగా, ఈనెల 18న తొలిదశలో 24 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 61.39 శాతం పోలింగ్ నమోదైంది. ఇక అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది దశ పోలింగ్, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడుతాయి.