ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్కూలు ఆవరణలో జరిగిన ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి చనిపోయాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో కొత్తగా భవనాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి వనం కృష్ణంరాజు, తొమ్మిదో తరగతికి చెందిన మరో విద్యార్థి కొరడా శ్రీరాములు ఆడుకుంటూ ఈ నిర్మాణంలోకి వెళ్లారు. అయితే వారు ఆడుకునే సమయంలో భవనంలోని సజ్జ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో విద్యార్థులు దాని కింద పడిపోయారు.
ఈ ప్రమాదంలో సజ్జ కింద పడి 15 ఏళ్ల కృష్ణంరాజు అనే విద్యార్థి చనిపోయాడు. శ్రీరాములు అనే మరో విద్యార్థికి కాళ్లు విరిగాయి. అయితే గాయపడిన విద్యార్థిని ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరోవైపు స్కూలుకు వచ్చిన తమ కొడుకు.. విగతజీవిగా మారటంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. భవనాన్ని నిర్మించే సమయంలో జాగ్రత్తలు తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు పాఠశాలలో జరిగిన ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి చనిపోయిన విషయం.. మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. ఈ ప్రమాదంపై నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని నారా లోకేష్ ఆదేశించారు. పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ భవనం నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారని నారా లోకేష్ ఆరోపించారు. పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.