ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నవారికి ముఖ్యమైన గమనిక.. సరికొత్త మోసాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన యువకులు నెలకు రూ.50వేలు సంపాదించొచ్చని చెప్పడంతో నమ్మి నిండా మునిగారు.. గుంటూరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన అనిల్ ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ అందమైన అమ్మాయితో కొన్ని వీడియోలు రికార్డు చేయించి పోస్టు చేశాడు. ఆ వీడియాల్లో వర్క్ ఫ్రం హోం అంటూ ప్రచారం చేశాడు.. ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ. 50 వేలు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం అంటూ నమ్మించాడు.
ఆ వీడియోను చూసి ఆసక్తి ఉన్నవాళ్లు.. తాను ఇచ్చే లింక్‌ను క్లిక్ చేయమని చెప్పాడు. కొంతమంది డబ్బులు వస్తాయి కదా అనే ఆశతో.. ఆ లింక్ క్లిక్ చేయగానే ఆ సంస్థ ప్రతినిధులు ఫోన్‌లో అందుబాటులోకి వచ్చారు. ఈ వర్క్ ఫ్రం హోంకు సంబంధించి.. తమ సంస్థలో చేరాలంటే దరఖాస్తు చేసుకునేందుకు రూ. 2 వేలు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయాలని చెప్పారు. అలాగే మేనేజర్ టీమ్‌లో చేరడానికి రూ. 5 వేలు, కంపెనీ ఖర్చుల మరో రూ. 5 వేలు కూడా ఆన్‌లైన్ ద్వారా తీసుకున్నారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది.
తాము సబ్బులు, కూల్ డ్రింక్‌లు, కిరాణా వస్తువులు వంటి వస్తువుల్ని తక్కువ ధరకు ఇస్తామని చెప్పారు. రూ. 30 వేల సరకును రూ.15 వేలకు ఇస్తే సరిపోతుందని చెప్పారు. మరికొంతమందిని తమ కంపెనీలో చేర్పిస్తే అందులో సగం కమిషన్ వస్తుందని నమ్మబలికారు. ఇలా ఎంతమంది చేర్పిస్తే.. అంత డబ్బులు వస్తాయని నమ్మించారు. నమ్మించేందుకు కొన్ని వస్తువుల ఫోటోలను తీసి వాట్సాప్‌కు పంపించి డబ్బులు కూడా జమ చేయించుకున్నారు. కానీ ఆ తర్వాత సరైన స్పందన లేకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చి మోసపోయామని గుర్తించారు.
హైదరాబాద్‌కు చెందిన యువకుల దగ్గర నుంచి రూ. 30 వేలు, రూ. 40 వేలు చొప్పున ఆన్‌లైన్‌లో జమ చేయించుకుని మోసం చేశారు. దీంతో వారు గుంటూరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. వర్క్ ఫ్రం హోమ్ పేరుతో జరిగే మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రైల్వేలో, హైకోర్టులో ఉద్యోగాల పేరుతో శ్రీనివాసరావు అనే వ్యక్తి మోసగించారంటూ మరికొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదుల సంఖ్యలో నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరుతో సుమారు రూ. కోటి వరకు వసూలు చేసి మోసం చేసినట్లు చెబుతున్నారు.